Saturday, May 3, 2008

చిన్న సినిమా

పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని కొంత మంది నిర్మాతలు ఆరోపించడం, అవునని చెప్పి పత్రికల్లో వ్యాసాలు రాయడం కొన్నేళ్ల నుంచి జరుగుతోంది. ఇందులో ముఖ్య కారణం పెద్ద సినిమాలు ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం అని.

మన రాష్ట్రంలోని ప్రతి పెద్ద పట్టణంలో కనీసం 10 థియేటర్లు ఉంటాయి. దాదాపు 5 మంచివి ఉంటాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా 4 థియేటర్లకు మించి విడుదలవ్వదు. కొన్ని చోట్ల మాత్రం మొదటి రోజు 10 థియేటర్లలో వేస్తారు. కాని రెండో రోజు నుంచీ మళ్లీ మామూలే.

పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి మూడు కూడా విడుదల కావడం లేదు. సంక్రాంతి, వేసవి, దసరా తప్పితే మిగతా రోజుల్లో పాత సినిమాలు వేసుకునే పరిస్థితిలో కొన్ని థియేటర్లున్నాయి.

ప్రతీ ఊళ్లోను అన్ని హంగులూ ఉన్న సినిమా హాళ్లు పెద్ద సినిమాల కోసమే ఎదురు చూస్తాయి। వాటి అద్దె ఎక్కువగా ఉంటుంది. ఏసీ వల్ల విద్యుత్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. టికెట్ ధర ఎంతైనా దానిపై ఒక రూపాయి మైంటెనెన్స్ కోసం పక్కన పెడతారు. అది టికెట్ మీద చూడొచ్చు. జీతాలు వగైరా ఖర్చులకు ఆ సొమ్ము వాడతారు. సో 400 కెపాసిటీ ఉన్న థియేటర్ నిండితే మొత్తం నాలుగు ఆటల మీదా 1600 రూపాయలు వస్తాయి. ఇదే ముఖ్య కారణం పెద్ద సినిమాల కోసం ఎదురు చూడ్డానికి. లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ పోటి పడతారు వాటికోసం. బ్లాక్ టికెట్ల వాళ్ల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తారు. కానీ సినిమా దారుణంగా పోతే మాత్రం అంతే సంగతి. ఈ మధ్య కొంత మంది థియేటర్ ఓనర్లు సినిమాను కొనేస్తున్నారు. హీరో ముందు సినిమా బాగా హిట్తైతే తర్వాతి సినిమాకు బాగా క్రేజ్ వస్తుంది. అప్పుడు పోటీ పెరిగి ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటున్నారు. సాధారణంగా ఒక హిట్టు తరావాత రెండోది ఫట్టే. మళ్లీ ఇంకో పెద్ద సినిమా కోసం అప్పు చేసి రెడీ అవుతారు. ఇదీ పెద్ద థియేటర్ల పరిస్థితి.

ఇక పెద్దవేమి లేకపోతే ఎంతో కొంత స్టార్ ఎట్రాక్షన్ ఉన్న వాళ్ల సినిమాలు ఆడిస్తారు. ఇవి కనీసం మొదటి రోజైనా హౌస్‌ఫుల్ అవుతాయి.

ఇక చిన్న సినిమాల్ని కొనడమే ఎక్కువ. ఒక జిల్లాకు రెండు ప్రింట్లకి 5 లక్షలు చేసి సినిమా కొన్నారు. అంతా కొత్తవారే. వారంలో ఎత్తేసారు. వాల్‌పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. సైకిల్ స్టాండ్, క్యాంటీన్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

సినిమా వ్యాపారం పెద్ద జూదం. తెలుగు సినిమాల సక్సెస్ రేటు 8 శాతం. ఇలాంటి పరిస్థితిలో ఎవ్వరూ చిన్న సినిమా వైపు చూడరు. చిన్న నిర్మాతకు తన సినిమా మీద నమ్మకం ఉంటే 5 సెంటర్లలో అయినా విడుదల చేసి తర్వాత పెంచుకోవచ్చు. దాదాపు అందరూ అప్పులు చేసి సినిమా తీస్తున్నారు. ల్యాబ్ దాటి బయటకు రావాలంటే అప్పు తీర్చాలి. సినిమా చూపిస్తేనేగాని బయ్యర్లు కొనరు. ఇక్కడే చిన్న సినిమాలకు దెబ్బ పడేది. అసలు కొనడమే ఎక్కువ. అయినా కూడా వచ్చే డబ్బులు తక్కువ. అన్నిటికన్నా చిన్న సినిమాల సక్సెస్ రేటు చాలా తక్కువ. పోయిన సినిమాల్లో నాణ్యత ఉంటుందా అంటే పరమ నాసిరకం. చిన్న సినిమా బతకాలంటే సబ్సిడీలు, పన్నుల మినహాయింపులు కాదు కావల్సింది. సినిమాలో దమ్ముంటే పెద్ద సినిమాకు పోటీగా విడుదల చేయవచ్చు.

శేఖర్ కమ్ముల ఆనంద్ దీనికి మంచి ఉదాహరణ। ఆ సినిమా చూసిన పరిశ్రమ పెద్దలు పెదవివిరిచారంట।అయినా శేఖర్ నిరుత్సహపడకుండా బాగా పబ్లిసిటీ చేశాడు। శంకర్ దాదా జిందాబాద్‌తో పాటు విడుదల చేశాడు. మొదట్లో కొన్ని థియేటర్లలోనే రిలీజ్ అయింది. మొదటి ఆట టాక్ వచ్చేసరికి బయ్యర్లు క్యూలు కట్టారు.

No comments: