Sunday, September 26, 2010

ఇళయరాజా తమిళ పాటలు

బాగా తీసిన యుగళగీతాల జాబితా ఇది. 
 Saturday, May 3, 2008

చిన్న సినిమా

పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని కొంత మంది నిర్మాతలు ఆరోపించడం, అవునని చెప్పి పత్రికల్లో వ్యాసాలు రాయడం కొన్నేళ్ల నుంచి జరుగుతోంది. ఇందులో ముఖ్య కారణం పెద్ద సినిమాలు ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం అని.

మన రాష్ట్రంలోని ప్రతి పెద్ద పట్టణంలో కనీసం 10 థియేటర్లు ఉంటాయి. దాదాపు 5 మంచివి ఉంటాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా 4 థియేటర్లకు మించి విడుదలవ్వదు. కొన్ని చోట్ల మాత్రం మొదటి రోజు 10 థియేటర్లలో వేస్తారు. కాని రెండో రోజు నుంచీ మళ్లీ మామూలే.

పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి మూడు కూడా విడుదల కావడం లేదు. సంక్రాంతి, వేసవి, దసరా తప్పితే మిగతా రోజుల్లో పాత సినిమాలు వేసుకునే పరిస్థితిలో కొన్ని థియేటర్లున్నాయి.

ప్రతీ ఊళ్లోను అన్ని హంగులూ ఉన్న సినిమా హాళ్లు పెద్ద సినిమాల కోసమే ఎదురు చూస్తాయి। వాటి అద్దె ఎక్కువగా ఉంటుంది. ఏసీ వల్ల విద్యుత్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. టికెట్ ధర ఎంతైనా దానిపై ఒక రూపాయి మైంటెనెన్స్ కోసం పక్కన పెడతారు. అది టికెట్ మీద చూడొచ్చు. జీతాలు వగైరా ఖర్చులకు ఆ సొమ్ము వాడతారు. సో 400 కెపాసిటీ ఉన్న థియేటర్ నిండితే మొత్తం నాలుగు ఆటల మీదా 1600 రూపాయలు వస్తాయి. ఇదే ముఖ్య కారణం పెద్ద సినిమాల కోసం ఎదురు చూడ్డానికి. లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ పోటి పడతారు వాటికోసం. బ్లాక్ టికెట్ల వాళ్ల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తారు. కానీ సినిమా దారుణంగా పోతే మాత్రం అంతే సంగతి. ఈ మధ్య కొంత మంది థియేటర్ ఓనర్లు సినిమాను కొనేస్తున్నారు. హీరో ముందు సినిమా బాగా హిట్తైతే తర్వాతి సినిమాకు బాగా క్రేజ్ వస్తుంది. అప్పుడు పోటీ పెరిగి ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటున్నారు. సాధారణంగా ఒక హిట్టు తరావాత రెండోది ఫట్టే. మళ్లీ ఇంకో పెద్ద సినిమా కోసం అప్పు చేసి రెడీ అవుతారు. ఇదీ పెద్ద థియేటర్ల పరిస్థితి.

ఇక పెద్దవేమి లేకపోతే ఎంతో కొంత స్టార్ ఎట్రాక్షన్ ఉన్న వాళ్ల సినిమాలు ఆడిస్తారు. ఇవి కనీసం మొదటి రోజైనా హౌస్‌ఫుల్ అవుతాయి.

ఇక చిన్న సినిమాల్ని కొనడమే ఎక్కువ. ఒక జిల్లాకు రెండు ప్రింట్లకి 5 లక్షలు చేసి సినిమా కొన్నారు. అంతా కొత్తవారే. వారంలో ఎత్తేసారు. వాల్‌పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. సైకిల్ స్టాండ్, క్యాంటీన్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

సినిమా వ్యాపారం పెద్ద జూదం. తెలుగు సినిమాల సక్సెస్ రేటు 8 శాతం. ఇలాంటి పరిస్థితిలో ఎవ్వరూ చిన్న సినిమా వైపు చూడరు. చిన్న నిర్మాతకు తన సినిమా మీద నమ్మకం ఉంటే 5 సెంటర్లలో అయినా విడుదల చేసి తర్వాత పెంచుకోవచ్చు. దాదాపు అందరూ అప్పులు చేసి సినిమా తీస్తున్నారు. ల్యాబ్ దాటి బయటకు రావాలంటే అప్పు తీర్చాలి. సినిమా చూపిస్తేనేగాని బయ్యర్లు కొనరు. ఇక్కడే చిన్న సినిమాలకు దెబ్బ పడేది. అసలు కొనడమే ఎక్కువ. అయినా కూడా వచ్చే డబ్బులు తక్కువ. అన్నిటికన్నా చిన్న సినిమాల సక్సెస్ రేటు చాలా తక్కువ. పోయిన సినిమాల్లో నాణ్యత ఉంటుందా అంటే పరమ నాసిరకం. చిన్న సినిమా బతకాలంటే సబ్సిడీలు, పన్నుల మినహాయింపులు కాదు కావల్సింది. సినిమాలో దమ్ముంటే పెద్ద సినిమాకు పోటీగా విడుదల చేయవచ్చు.

శేఖర్ కమ్ముల ఆనంద్ దీనికి మంచి ఉదాహరణ। ఆ సినిమా చూసిన పరిశ్రమ పెద్దలు పెదవివిరిచారంట।అయినా శేఖర్ నిరుత్సహపడకుండా బాగా పబ్లిసిటీ చేశాడు। శంకర్ దాదా జిందాబాద్‌తో పాటు విడుదల చేశాడు. మొదట్లో కొన్ని థియేటర్లలోనే రిలీజ్ అయింది. మొదటి ఆట టాక్ వచ్చేసరికి బయ్యర్లు క్యూలు కట్టారు.

Wednesday, February 13, 2008

ట్యూన్లు అయిపోయాయి

దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇళయరాజా పాటల్లో క్వాలిటీ తగ్గుతోంది అని స్నేహితుడితో అంటే రాజా దగ్గర ట్యూన్లు అయిపోయాయి అన్నాడు. అదేం మాట అని అనుకున్నాను. తమిళ్, తెలుగు సినిమాలకు ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఈ పదిహేనేళ్లలో ఇళయరాజా నుంచి చాలా కొన్ని పాటలు మత్రమే చెప్పుకోతగ్గవి వచ్చాయి. సంగీతం మీద అంత పట్టున్న ఆయన పాటల్లో పస తగ్గడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.

తెలుగు సినిమాలకు తెలుగుదనం తెచ్చిన బాపు-రమణలదీ అదే పరిస్థితి. పెద్దగా పేరు రాక పోయినా 'గోరంత దీపం' సినిమా నాణ్యతా పరంగా ఏ విషయంలోనూ తీసిపోదు. అలాంటి వాళ్లు ఈ మధ్య తీసిన సినిమాలు చుస్తే వాళ్లే చేశారా అన్న అనుమానం కలగక మానదు.

సాగరసంగమం వంటి అద్భుతాన్నిచ్చిన విశ్వనాధ్ చిన్నబ్బాయ్ లాంటి సినిమా ఎందుకు తీశాడో అర్ధంకాలేదు.

జోకర్ సినిమా నుంచి వంశీ పతనం ప్రారంభమైంది. ఎప్పుడు సినిమాలు మానేస్తాడా అని ఎదురు చూస్తున్నా. వంశీకి వీరభిమానిని నేను.

ప్రతీ సినిమా ఆణిముత్యంలా తీయడం దాదాపు అసాధ్యం. కానీ క్వాలిటీగా తీయడం పెద్ద విషయం కాదు. వయసు మీద పడటంవల్ల వాళ్లు బాగా తీయలేకపోతున్నారనుకుంటే 70ల్లో ఉన్న క్లింట్ ఈస్ట్వుడ్, స్కోర్సిసీ, షూమేకర్ అలాంటిదేమీ లేదని నిరూపిస్తున్నారు.

Saturday, January 19, 2008

సినిమా కష్టాలు

కొన్ని రోజులు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పని చేసినప్పుడు సినిమా వాళ్ల కష్టాలు ప్రత్యక్షంగా చూశాను। ధియేటర్ ఉండటమంటే గొప్ప అనే ఫీలింగ్ ఉండేది నాకు। కానీ మాకు సినిమా (స్టార్లవి) ఇవ్వండి అంటూ డిస్ట్రిబ్యూటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ధియేటర్ యాజమాన్యం పడే పాట్లు చూసి జాలికలిగేది। పైగా లక్షల్లో అడ్వాన్సులు ఎదురు ఇవ్వాలి. ఎందుకయ్యా పెద్ద సినిమాలు, చిన్నవి చేయొచ్చుగా అంటే వాటివల్ల ఏమీ మిగలదనేవారు. పెరిగిన మెయింటనన్స్ ఖర్చులు తట్టుకుని నిలబడాలంటే పెద్దవే పెద్ద దిక్కని చెప్పేవాళ్లు. అవి అడ్డంగా పోతే చేతులెత్తేసేవారు.
మణిరత్నంAmrutha వారం రోజులకే ఎత్తేశారు। తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వకుండా డిస్ట్రిబ్యూటర్ పత్తాలేకుండా పోయాడు।ధియేటర్ వాళ్లు కేసు వేశారనుకోండి. డిస్ట్రిబ్యూటర్లని చూస్తే గొర్రెల్లా కనిపించేవారు. పోటీ పడి ఎంతకైనా సరే పెద్ద సినిమా కొనేసేవారు. తీరా సినిమా పోతే అంతే సంగతి. డబ్బున్న వాళ్లైతే వేరే సినిమాలతో గట్టెక్కేవాళ్లు. సినిమా పిచ్చతో చేతిలో డబ్బంతా పెట్టి కొన్నవాళ్లు మాత్రం రోడ్డున పడుతున్నారు. కొందరు ఆశ చావక అప్పులు చేసి చిన్న సినిమాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. చిన్న సినిమాలను చూసే కొనేవారు కానీ వారం రోజులు అడితే ఒట్టు. ప్రింట్ ఖర్చులు కూడా వచ్చేవి కాదు. అందుకే చాలా మంది వాటి వైపు చూడరు. చూస్తే మసే. కానీ అప్పుడప్పుడూ కొంత మందికి లాటరీలు తగులుతాయి (హ్యపీ డేస్).

ఇక నిర్మాతల సంగతి. పెద్ద వాళ్లు సినిమా మొదలెట్టిన వెంటనే బేరాలు మొదలవుతాయి. అడ్వాన్సులంటూ డిస్ట్రిబ్యూటర్లను వేధిస్తారు. సినిమా విడుదలకు ముందే 70 శాతం లాగేస్తారు. సినిమా పోతే మాత్రం బడా డిస్ట్రిబ్యూటర్లు అంత తేలిగ్గా వదలరు. తర్వాతి సినిమా తమకే అమ్మాలని, అదీ తక్కువ రేటుకని ఫిటింగులు పెడతారు. తేడా జరిగితే సినిమా రిలీజ్ కానివ్వరు.
చిన్న సినిమాల వాళ్లు మాత్రం ఏదోరకంగా సినిమా అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు।

Tuesday, December 25, 2007

కారణం

తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావాలనుకునేవాళ్లూ, కుటుంబ సమేతంగా వెళ్లదగ్గ చిత్రాలు రావాలనుకునేవాళ్లూ, సినిమాల్లో అవకాశాలు రానివాళ్లూ విమర్శించేది స్టార్ హీరోల్ని, బడా నిర్మాతల్ని.

మంచి సినిమాలు రాకపోవడానికి చెత్త సినిమాలు తీసేవాళ్లు బాధ్యతవహించాలా? వాళ్లు మంచి నిర్మాతల్ని, నటుల్ని అడ్డుకుంటున్నారా? వారసులు హీరోలుగా రావడం వల్ల, రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడంవల్ల మంచి సినిమాలు రావడం లేదా?

అదే అన్నట్టుగా మీడియాలో, బ్లాగుల్లో చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి.

నిర్మాతకు డబ్బులు, హీరోలకు స్టార్డం కావాలి. అందుకు వాళ్లు ఏమైనా చేస్తారు. వాళ్లను తిట్టి కసి తీర్చుకోవడంవల్ల ఉపయోగం ఉండదు.

క్వాలిటీ సినిమా కావాలంటే మంచి అభిరుచి ఉన్న నిర్మాత కావాలి. అతనికి సినిమాలపై పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్లు చాలా మంది రావాలి. అప్పుడే విషయం ఉన్న దర్శకులకీ, నటులకూ అవకాశాలు వస్తాయి.