Saturday, January 19, 2008

సినిమా కష్టాలు

కొన్ని రోజులు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పని చేసినప్పుడు సినిమా వాళ్ల కష్టాలు ప్రత్యక్షంగా చూశాను। ధియేటర్ ఉండటమంటే గొప్ప అనే ఫీలింగ్ ఉండేది నాకు। కానీ మాకు సినిమా (స్టార్లవి) ఇవ్వండి అంటూ డిస్ట్రిబ్యూటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ధియేటర్ యాజమాన్యం పడే పాట్లు చూసి జాలికలిగేది। పైగా లక్షల్లో అడ్వాన్సులు ఎదురు ఇవ్వాలి. ఎందుకయ్యా పెద్ద సినిమాలు, చిన్నవి చేయొచ్చుగా అంటే వాటివల్ల ఏమీ మిగలదనేవారు. పెరిగిన మెయింటనన్స్ ఖర్చులు తట్టుకుని నిలబడాలంటే పెద్దవే పెద్ద దిక్కని చెప్పేవాళ్లు. అవి అడ్డంగా పోతే చేతులెత్తేసేవారు.
మణిరత్నంAmrutha వారం రోజులకే ఎత్తేశారు। తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వకుండా డిస్ట్రిబ్యూటర్ పత్తాలేకుండా పోయాడు।ధియేటర్ వాళ్లు కేసు వేశారనుకోండి. డిస్ట్రిబ్యూటర్లని చూస్తే గొర్రెల్లా కనిపించేవారు. పోటీ పడి ఎంతకైనా సరే పెద్ద సినిమా కొనేసేవారు. తీరా సినిమా పోతే అంతే సంగతి. డబ్బున్న వాళ్లైతే వేరే సినిమాలతో గట్టెక్కేవాళ్లు. సినిమా పిచ్చతో చేతిలో డబ్బంతా పెట్టి కొన్నవాళ్లు మాత్రం రోడ్డున పడుతున్నారు. కొందరు ఆశ చావక అప్పులు చేసి చిన్న సినిమాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. చిన్న సినిమాలను చూసే కొనేవారు కానీ వారం రోజులు అడితే ఒట్టు. ప్రింట్ ఖర్చులు కూడా వచ్చేవి కాదు. అందుకే చాలా మంది వాటి వైపు చూడరు. చూస్తే మసే. కానీ అప్పుడప్పుడూ కొంత మందికి లాటరీలు తగులుతాయి (హ్యపీ డేస్).

ఇక నిర్మాతల సంగతి. పెద్ద వాళ్లు సినిమా మొదలెట్టిన వెంటనే బేరాలు మొదలవుతాయి. అడ్వాన్సులంటూ డిస్ట్రిబ్యూటర్లను వేధిస్తారు. సినిమా విడుదలకు ముందే 70 శాతం లాగేస్తారు. సినిమా పోతే మాత్రం బడా డిస్ట్రిబ్యూటర్లు అంత తేలిగ్గా వదలరు. తర్వాతి సినిమా తమకే అమ్మాలని, అదీ తక్కువ రేటుకని ఫిటింగులు పెడతారు. తేడా జరిగితే సినిమా రిలీజ్ కానివ్వరు.
చిన్న సినిమాల వాళ్లు మాత్రం ఏదోరకంగా సినిమా అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు।

3 comments:

Anurup said...

చాల బాగుంది టపా. మీరు ఇంక సినిమా ప్రరిస్రమలో పని చేస్తున్నారా? ఇటువంటి "inside stories" వుంటే దయచేసి పంచుకోండి (సినిమా పరిస్రమే కానావసరంలేదు).

కొత్త పాళీ said...

ఇంట్రస్టింగ్. బ్లాగ్లోకానికి స్వాగతం. సినిమా జీవిత కథలు మరిన్ని మీ కీబోర్డునుంచి వెలువడతాయని ఎదురుచూస్తుంటాం.

రాధిక said...

బ్లాగ్లోకానికి స్వాగతం
ధియేటర్ యజమానుల బాధలు నాకూ తెలుసు.మా చినతాతగారికి 2 ధియేటర్లు వున్నాయి.పెద్ద హీరోల సినిమాలు పోటీ పడి తేవడం,సినిమా బాగోలేక పోయినా అభిమానులకు భయపడి చచ్చినట్టు ఆడించడం.పక్కోడి సినిమాకి పెట్టిన కటౌట్ కన్నా పెద్దది పెట్టలేదని గొడవపడే అభిమానులను బుజ్జగించడం,సినిమా బాగోకపోయినా,సూపరుగా వున్నా సీట్లను చింపేసే అభిమానులను ఏమీ అనలేక లోపల్లోపల ఏడవడం.......చెప్పితే బోలెడు.వినేవాళ్ళకి సరదాఅ వుంటాయిగానీ పాపం పడేవాళ్ళకే తెలుస్తుంది అసలు కష్టం.